విజయవాడ కనక దుర్గ

Last visit was: Tue Jan 23, 2018 11:29 pm

విజయవాడ కనక దుర్గ

Postby Siva on Wed Sep 30, 2009 6:54 pm

విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఆంధ్రప్రదేశ్ లో వేంకటేశ్వరస్వామి గుడి తర్వాత అత్యంత జనాకర్షణ కలిగిన గుడి. బ్రహ్మాండపురాణంలో కనకదుర్గమ్మను శక్తిపీఠంగా వర్ణించారు.

Image

కనక దుర్గమ్మ గుడికి ఎలా వెళ్ళాలి?
ఆంధ్రప్రదేశ్ > కృష్ణాజిల్లా > విజయవాడ
విజయవాడలో కృష్ణానది ప్రక్కన ఇంద్రకీలాద్రి అనే చిన్న కొండ మీద అమ్మవారి గుడి ఉంది. విజయవాడ బస్ స్టాండ్ నుండి, రైల్వేస్టేషను నుండి కనక దుర్గమ్మగుడి వద్దకు వెళ్ళటానికి దేవస్థానం వారు ఉచిత బస్ సర్వీసులు నడుపుతున్నారు. కొండ మీదకు ఘాట్ రోడ్డు కలదు. ఆటోలు, టాక్సీలు కూడా కొండ మీదకు వెళ్తాయి. కొండ మీదకు వెళ్ళటానికి మెట్లమార్గం కూడా ఉంది.
దగ్గరలోని ఎయిర్ పోర్టు: గన్నవరం, విజయవాడకు 30కి.మి దూరంలో ఉంది.

కనక దుర్గమ్మ గుడి:
అమ్మవారి గుడి కొండ మధ్యలో ఉంది. అమ్మవారి గుడి చుట్టూ ఇళ్ళు ఉన్నాయి. దుర్గాదేవి గుడి బంగారు శిఖరంతో అత్యంత శోభాయమానంగా ఉంటుంది. గర్భగుడి ప్రవేశద్వారంపైన ఒక చక్కటి శ్లోకం వ్రాసి ఉంటుంది.


అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.

ఇతర ప్రదేశాలు:
భవానీ మంటపం: బస్ దిగిన వెంటనే మనకు ఎడమ వైపు భవానీ మంటపం కనిపిస్తుంది. అక్కడ చాముండా, మహాకాళి మొదలైన ఉగ్రమైన అమ్మవారి రూపాలు కొండ మీద చెక్కబడి ఉన్నాయి. భవానీ మాల వేసుకున్న భక్తులు అక్కడ పూజలు చేస్తారు. ప్రతీరోజు అక్కడ ఉత్సవమూర్తులకు కుంకుమార్చన చేస్తారు. ఇదివరకు కాలంలో అక్కడ ఒక కోనేరు ఉండేది. దానిని దుర్గాకుండం అని పిలిచేవారు. బ్రహ్మాండపురాణంలో దాని మహత్మ్యం గురించి చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో దేవస్థానం వారు ఇప్పుడు ఒక బిల్డింగు కట్టేశారు.

అశ్వథ్థవృక్షం: అమ్మవారికి ఎదురుగా ఒక అశ్వథ్థవృక్షం ఉంది. దాని క్రింద ఆంజనేయ స్వామి [గుడికి క్షేత్రపాలకుడు] విగ్రహం ఉంది.

మల్లేశ్వరస్వామి : మల్లేశ్వరస్వామి గుడి మెట్లమార్గంలో నుండి వస్తుంటే మొదట కనిపిస్తుంది. మల్లేశ్వరస్వామి కనక దుర్గమ్మ భర్త.

విఘ్నేశ్వరుడు, నటరాజ స్వామి, శివకామ సుందరిల గుళ్ళు దుర్గాదేవి గుడికి మల్లేశ్వరస్వామి గుడికి మధ్యలో ఉన్నాయి. యీ మూడు గుళ్ళు ఒకే వరసలో ఉంటాయి.

నాగేంద్ర స్వామి: దుర్గాదేవి గుడి ప్రక్కన ఉన్న సుబ్రమణ్యేశ్వర స్వామి గుడిలో ఉన్నది. పెళ్ళైన స్త్రీలు సంతాన ప్రాప్తికోసం నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తారు.

లక్షకుంకుమార్చన స్థలం: ఇది అమ్మవారి ధ్వజస్థభం దగ్గర ఉంది.

నిత్యపూజా స్థానం: పూర్వకాలంలో యీ ప్రదేశంలో ఉన్న శ్రీచక్రం దగ్గర నిత్యపూజలు నిర్వహించేవారు. కాని ప్రస్తుతం రద్దీ పెరగటం వలన నిత్య పూజలను ప్రాకార మంటపం లోనికి మార్చారు.

కళ్యాణ మంటపం: పూర్వం యీ ప్రదేశంలో అమ్మవారి కళ్యాణం నిర్వహించేవారు. ప్రస్తుతం భవానీ మంటపంలో దుర్గాదేవి కళ్యాణం చేస్తున్నారు.

శంకరాచార్య మంటపం: ఇది మల్లేశ్వరస్వామి గుడి ప్రక్కన ఉంది. ఇందులో ఆదిశంకరాచార్య స్వామి విగ్రహం ఉంది.

చండీహోమ మందిరం: ఇది ఆదిశంకరాచార్య మంటపం ప్రక్కన ఉంది. ఇందులో ప్రతీరోజు చండీ హోమం చేస్తారు.

ఇంకా కనక దుర్గ గుడి ప్రాంగణంలో నవగ్రహాలయం, శాంతి కళ్యాణ వేదిక, గోపీకృష్ణుని విగ్రహం, నిత్యాన్నదాన భవనం, అద్దాల మంటపం ఉన్నాయి.

స్థలపురాణం:
కనక దుర్గమ్మకు సంబంధించి మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది ఇంద్రకీలుని కథ, రెండోది అర్జుని కథ, మూడోది మాధవవర్మ కథ.

ఇంద్రకీలుని కథ: ఇంద్రకీలుడు జగన్మాత భక్తుడు. అతను చిరకాలం భక్తితో అమ్మవారిని ఆరాధించి దుర్గాదేవి దర్శనం పొందాడు. అమ్మవారు ఎల్లప్పుడు తన వద్దనే ఉండాలని వరంకోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు తర్వాత జన్మలో నీవు కొండ రూపం ధరిస్తావని, ఆ కొండమీద తను మహాలక్ష్మి రూపంలో అవతరిస్తానని వరమిచ్చింది.

అర్జునుడు మరియు మల్లేశ్వరస్వామి: పాండవమధ్యముడు అయిన అర్జునుడు అరణ్యవాస సమయంలో తన అన్న ధర్మరాజు ఆజ్ఞమీద ఇంద్రకీలాద్రి మీద ఇంద్రుని కొరకు తపస్సు చేసాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై శివమంత్రం ఉపదేశించి, పాశుపతాస్త్రం కొరకు శివుని ఆరాధించమని చెప్తాడు. అలా అర్జునుడు తపస్సు చెస్తున్నప్పుడు, ఒకానొక రోజు అతి భయంకరమైన పెద్ద పంది ఒకటి వచ్చి తపస్సుకి భంగం కలిగించసాగింది. తపోభంగమైన అర్జునుడు దాన్ని వేటాడసాగాడు. కాని అది చాలా చురుకుగా బాణాలనుండి తప్పించుకొని పారిపోతుంది. ఎట్టకేలకు అర్జునుడు గురిచూసి దాని మీదకు బాణం వేసాడు. కాని దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి రెండు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. అంతలో ఒక కోయదొర వచ్చి ఆ పందిని తీసుకొని వెళ్ళసాగాడు. అప్పుడు అర్జునుడు ఆ పందిని నేను సంహరించాను కాబట్టి ఆ పంది నాది అని వాదించసాగాడు. దానికి ఆ కోయదొర నవ్వాడు. దానికి కోపం వచ్చిన అర్జునుడు అతనితో ఎవరు గొప్పో తేల్చుకుందామని యుద్ధానికి దిగాడు. అర్జునుడు ఎన్ని దివ్యాస్త్రాలు వేసినా కూడా ఆ కోయరాజుని ఏమీచేయలేక పోయాడు. తన దివ్యాస్త్రాలన్ని వృధాఅయిన కారణంగా అర్జునుడు తన విల్లు తీసుకొని ఆ కోయరాజు తలమీద కొట్టబోతాడు. అప్పుడు ఆ కోయరాజు మాయమై ఆ ప్రదేశంలో పరమశివుడు ప్రత్యక్షమై నవ్వుతూ కనిపిస్తాడు. పరమశివుని తో యుద్ధం చేసిన కారణానికి అర్జునుడు ఎంతో సిగ్గుపడి, బాధపడతాడు. తర్వాత శివుని స్తుతిస్తాడు. దానికి సంతసించిన శివుడు అర్జునికి పాశుపతాస్త్రం ఇచ్చి, దాన్ని అత్యవసర సందర్భాలలో, అరుదుగా మాత్రమే వాడాలి అని చెప్తాడు. తర్వాత శివుడు అర్జునికి నిగ్రహం సాధించమని చెప్పి అప్పుడు మాత్రమే అస్త్రాలు లోకకళ్యాణం కు ఉపయోగపడతాయి అని చెప్పి మాయమవుతాడు. అర్జునికి వరాలిచ్చిన మల్లేశ్వరస్వామి శక్తి కనక దుర్గ . ఇంద్రుడిచేత కీలితం చేయబడ్డాడు కాబట్టి అర్జునికి ఇంద్రకీలుడు అని కూడా పేరు వచ్చింది. అర్జునికి ఉన్న విజయనామం వల్ల యీ ప్రాంతానికి విజయపురి, విజయవాటిక, విజయవాడ, బెజవాడ, బెజ్జువాడ అని పేర్లు వచ్చాయని చెప్తారు.

మాధవవర్మ కథ: పూర్వం విజయవాడను మాధవవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతను అతి జాగ్రత్తతో ప్రజలను కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూసుకొనేవాడు. అతను నిత్యం మల్లేశ్వరస్వామిని పూజ చేసేవాడు. ఒకానొక రోజు అతని కుమారుడు రధం మీద విజయవాడ పురవీధులలో తిరుగుతున్నాడు. కానీ అనుకోకుండా ఒక చిన్నపిల్లవాడు అతివేగంగా వెళ్తున్న ఆ రధచక్రాల క్రింద పడి మరణిస్తాడు. ఆ పిల్లవాడు ఆ రాజ్యంలో నివసిస్తున్న ఒక పేద బిచ్చగత్తె ఒక్కగానొక్క కుమారుడు. ఆమె వెళ్ళి మాధవవర్మకు అతని కుమారుని కారణంగా తన బిడ్డ చనిపోయాడు అని ఫిర్యాదు చేస్తుంది. మాధవవర్మ తన జీవితంలో ఎప్పుడూ తప్పుడు తీర్పులు చెప్పలేదు. అతనికి ప్రస్తుత పరిస్థితి పరీక్షలాగా మారింది. అతను వెంటనే భవిష్యత్తు రాజు అయిన తన కుమారుడికి మరణ శిక్షవేసి అమలు పరిచాడు. అతని తీర్పుకి సంతసించిన దుర్గాదేవి కనక వర్షం కురిపించింది. కాబట్టి ఆమెకు కనకదుర్గ అని పేరు వచ్చింది. మల్లేశ్వరస్వామి ఇద్దరి బిడ్డలకు తిరిగి బ్రతికిస్తాడు.


Reference article : shakti-peethas/topic95.html

Topic Tags

Dashara festival, Durga puja, Krishna river, Shakti temples, Temples in Andhra pradesh, Travel India

  • NAVIGATION