కామాఖ్య - కామ రూపిణి

Last visit was: Tue Jan 23, 2018 11:29 pm

కామాఖ్య - కామ రూపిణి

Postby Uma on Mon Nov 23, 2009 12:57 am

శక్తిపీఠాలలో కామాఖ్య అతి ముఖ్యమైనది. విశ్వంలోనే జగన్మాతకి ఇది అత్యంతప్రీతిపాత్రమైన ప్రదేశం.
కాళికాపురాణం ప్రకారం ఇక్కడి ప్రతి ఇసుకరేణువు ఒక్కొక్క శక్తిపీఠం.

కామాఖ్య పరమం తీర్ధం, కామాఖ్య పరమం తపః /
కామాఖ్య పరమో ధర్మః, కామాఖ్య పరమాగతిః //

అని వర్ణించారంటే ఈ క్షేత్రం గొప్పతనమేమిటో అర్థం చేసుకోవచ్చు.

కామాఖ్యదేవి ఉన్న ప్రదేశం:
భారతదేశం > అస్సాం > కామరూప్ జిల్లా > నీలాచల్
కామాఖ్య గుడి ఇంకా గౌహతిలోని ముఖ్యమైన గుళ్ళని ఈ మ్యాపులో గుర్తించారు.


ImageImage

కామాఖ్యాదేవి మందిరం గౌహతికి దగ్గరలోని నీలాచలపర్వతం పైన ఉంది. కలకత్తా నుండి రైలులో ఇక్కడికి వచ్చేటప్పుడు గౌహతికి కొంచెం ముందే ఈ స్టేషను వస్తుంది. నీలాచల పర్వతం ఎటుచూసినా పచ్చదనంతో, అద్భుతమైన ప్రకృతిసోయగంతో, చూసేవారికి ఆ అమ్మ నిజస్థానానికి చేరుకున్న అనుభూతిని కలిగిస్తుంది.
ఈపర్వతంపై ఉన్న అమ్మని చేరుకోవడానికి రెండు మార్గ్గాలున్నాయి. ఒకటి మెట్లమార్గం కాగా (సుమారు ఒక గంట సమయం పడుతుంది), మరొకటి రోడ్డుమార్గం (ఇది కామాఖ్య గేట్ అనే ప్రదేశం నుండి మొదలౌతుంది). ఇక్కడ ఎల్లప్పుడూ సిటీ బస్సులు, టాక్సీలు, ఆటోలు సులభంగా లభ్యమౌతాయి.

దగ్గరలోని బస్ స్టేషన్ : నీలాచల్, గౌహతి
దగ్గరిలోని రైల్వేస్టేషన్ : నీలాచల్, గౌహతి
దగ్గరిలోని ఎయిర్ పోర్ట్ : గౌహతి

కామాఖ్య స్థలపురాణం :

కామరూపిణీ విఖ్యాతా హరిక్షేత్రే సనాతనీ /
యోనిముద్రా త్రిఖండేశీ మాసే మాసే నిదర్శితా //

పూర్వం గౌహతిని కామరూప దేశం, హరిక్షేత్రం, ప్రాగ్జ్యోతిషపురం మొదలైన పేర్లతో పిలిచేవారు. ఇది ఒకప్పుడు నరకాసురుడి రాజధానిగా (ప్రాగ్జ్యోతిషపురం) ఉండేది.
పూర్వం ఒకప్పుడు విష్ణుమూర్తి శ్వేతవరాహ అవతారమెత్తి, రాక్షసుడైన హిరణ్యాక్షుడిని సంహరించి, అతడి బారినుండి భూమిని కాపాడాడు. కాని అది తామసిక అవతారం కావడంవల్ల, తన నిజస్థితిని గుర్తించుకోలేకపోయాడు. భూదేవిని పెళ్ళాడి ఈక్షేత్రంలోనే నివశించసాగాడు.

సూర్యాస్తమయ సమయంలో (సాయంసంధ్యలో) మైధునం నిషిద్ధం. కాని ఒకానొక సమయంలో వారు అది పాటించకపోవటంవల్ల, రాక్షశాంశతో వారికి ఒక పిల్లవాడు జన్మించాడు. విష్ణుమూర్తి ఆ పిల్లవాడికి నరకుడు అని పేరు పెట్టి, ప్రాగ్జ్యోతిషపురానికి రాజుగా చేశాడు. ఈ నరకుడు లోకకంటకుడౌతాడని, విశ్వరక్షణార్థం అతడు చంపబడతాడని ఆ స్వామి భూదేవికి ఆ సమయంలో చెప్పాడు. కాని భూదేవి ఎన్నోవిధాల విష్ణుమూర్తిని ప్రార్థించి "నావల్ల చంపబడితేనే తప్ప అతనికి మృత్యువు రాకూడదు" అనే వరాన్ని అడిగింది. అప్పుడు ఆయన భూదేవికి ఆ వరాన్ని అనుగ్రహించి, ఇక వరాహవతారాన్ని చాలించి, తన నిజధామమైన వైకుంఠానికి తరలిపోయాడు.

ఆ భూదేవియొక్క మయారూపమే కామాఖ్యాదేవి అని భావిస్తారు. నరకుడు భూదేవిని పూజించి విపరీతమైన శక్తిని సంపాయించి, దానితో అనేక యుగాలపాటు ప్రపంచాన్ని శాసించాడు. అతడు పదహారువేల మంది రాజకన్యలను చెరపట్టి, వారి ఇష్టానికి వ్యతిరేకంగా వారిని అనుభవించసాగాడు. అదే సమయంలో బాణాసురునితో స్నేహం చేసాడు. ఆ బాణాసురుడు మెల్లగా తన మాటలతో అతడిని కామాఖ్యదేవి పూజకి దూరం చేయసాగాడు. ఒకానొక సమయంలో "కామాఖ్యదేవి కూడా పెళ్ళికాని ఆడపిల్లేనని, నువ్వు ఆమెని పెళ్ళిచేసుకోవచ్చు" అని సూచించాడు.

ఒకరోజు రాత్రి అమ్మవారు తన మందిరంలో నాట్యం చేస్తుండగా చూసిన నరకుడు, ఆమెను సమీపించి తనని పెళ్ళిచేసుకోమని అడిగాడు. ఆమె పెద్దగానవ్వి, ఒకరాత్రిలోగా గుడి, కుండం, మరియు నీలాచలం క్రిందనుండి గుడివరకు మెట్లదారి, నిర్మించగలిగితే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. నరకుడు ఇంతకుముందు ఆమెని పూజించి సంపాయించిన మాయాశక్తితో చాలావేగంగా వాటన్నింటి నిర్మాణం చేయసాగాడు. అవన్నీ పూర్తికావచ్చే తరుణంలో భగవంతుడైన విష్ణుమూర్తి కోడిపుంజు రూపంలో ఆవిర్భవించి రాత్రి ఇంకా మిగిలివుండగానే కూతపెట్టాడు. కోడికూత అనేది రోజు ప్రారంభానికి సూచన కాబట్టి నరకుడు ఖిన్నుడై, క్రోధంతో ఆ కోడిపుంజుని వెంటాడి చంపాడు. కాని ఈలోగా నిజంగానే రాత్రి పూర్తయ్యి, పగలు వచ్చేసింది. నరకుడు తన ప్రయత్నంలో విఫలమౌటంతో కామాఖ్యదేవి మీద ఆగ్రహం చెందాడు. అందువల్ల దేవి ఆ ప్రదేశం నుండి అంతర్ధానం చెందింది. అక్కడ ఇప్పటికీ అసంపూర్తిగా మిగిలివున్న మెట్లదారిని మేఖలౌజ మార్గం అని పిలుస్తారు. నరకుడు కోడిపుంజుని చంపిన ప్రదేశం కుకురకాటచక్కి అని పిలవబడుతుంది. ఇది అసోంలోని దరాంగ్ జిల్లాలో ఉంది.

ఆతర్వాత కొన్నాళ్ళకు నరకుడు ఇంద్రుడిమీదకి దండెత్తివెళ్ళి, ఇంద్రుడు పారిపోవటంతో దేవతల తల్లి అయిన అదితి కర్ణకుండలాలని అపహరించాడు. ఈకార్యం దేవతలందరికి గొప్ప అవమానంగా పరిణమించింది. ఆసమయంలోనే విష్ణుమూర్తి మరియు భూదేవిలు, శ్రీకృష్ణ సత్యభామలుగా భూమిపై అవతరించివున్నారు. ఇంద్రుడు వారివద్దకు వచ్చి, నరకాసురుణ్ణి వధించమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురవధ కోసం సత్యభామాసమేతుడై బయలుదేరాడు. కామాఖ్యదేవికూడా వారికి తోడుగా ఉంటుంది. సత్యభామాదేవి, నరకుడు తన కొడుకేనన్న సంగతి గుర్తించలేకపోయింది. పైగా నరకుడు ఆమెతో కామాతురుడై, అసభ్యంగా ప్రసంగించాడు. దానితో ఆమె ఆగ్రహించి, శ్రీకృష్ణుడు అనుగ్రహించిన దివ్యాస్త్రంతో నరకాసురుణ్ణి సంహరించింది. ఆతర్వాత శ్రీకృష్ణుడు చెరలోవున్న పదహారువేలమంది రాజకన్యలని విడిపించాడు. కానివారు శ్రీకృష్ణునే వరించామని చెప్పటంతో, ఆయన వారిని వివాహమాడాడు. ఆపై నరకుని కొడుకైన భగదత్తుని ప్రాగ్జ్యోతిషపురానికి రాజుగాచేసి శ్రీకృష్ణుడు తన పరివారంతో, సత్యభామాసమేతుడై తనరాజధాని అయిన ద్వారకానగరానికి తరలివెళ్ళాడు.


Reference article : ashtadasa/topic61.html

Topic Tags

18 Shaktipeethas, Diwali festival, Guwahati tourism, Shakti temples, Tantra goddess, Temples in North East India

  • NAVIGATION