గౌహతి - కామాఖ్యా దేవి

Last visit was: Tue Jan 23, 2018 11:29 pm

గౌహతి - కామాఖ్యా దేవి

Postby Uma on Thu Nov 26, 2009 10:06 pm

కామాఖ్య ఆ జగన్మాత నిజస్థానాలైన 18 శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతూవుంది. అమ్మవారి యోనిభాగం ఈప్రదేశంలో పడటంవల్ల ఇక్కడ కామాఖ్యశక్తిపీఠం ఏర్పడింది. ఇక్కడి భైరవుని పేరు ఉమానందుడు.

కామరూపిణీ విఖ్యాతా హరిక్షేత్రే సనాతని /
యోనిముద్రా త్రిఖండేశీ మాసేమాసే నిదర్శితా //

అని ఆ అమ్మ సర్వదా కీర్తించబడుతూవుంది.

కామాఖ్య ఉండే ప్రదేశం :
భారతదేశం > అస్సాం > కామరూప్ జిల్లా > గౌహతి దగ్గర > నీలాచల పర్వతం
ఇది లొహిత్యానదీ (బ్రహ్మపుత్రా) తీరప్రాంతంలో నెలకొనివుంది.
దగ్గరిలోని బస్ స్టేషన్స్ : నీలాచల్, గౌహతి.
దగ్గరిలోని రైల్వేస్టేషన్స్ : నీలాచల్, గౌహతి.
దగ్గరిలోని విమానాశ్రయం : గౌహతి.
గౌహతికి దగ్గరలోని పరమపావనమైన ఈనీలాచల పర్వతంపైనే అమ్మ దివ్యధామం నెలకొనివుంది.

కామాఖ్య దేవాలయం :ఈ ఆలయం తేనెపట్టు ఆకృతిలోని ఏడు శిఖరాలతో, వాటిపైన నిలపబడిన బంగారు త్రిశూలాలతో అత్యంత శోభాయమానంగా వెలుగొందుతూ వుంటుంది. దివ్యమైన ఈఆలయం మూడు ముఖ్య మందిరాలుగా నిర్మితమైవుంది. దీనిలోని పడమరవైపు మందిరం పెద్దగా దీర్ఘచతురస్రాకారంలో వుండి, దానిలో నాగమాత యొక్క విగ్రహాన్ని కలిగివుంది. కాని ఈమందిరాన్ని సాధారణభక్తుల పూజల కోసం ఉపయోగించరు. దీనికి దక్షణంగావున్న మరో మందిరంలో చాముండేశ్వరీదేవి నెలకొనివుంది.
ఈరెండు మందిరాలకి మధ్యలోవున్న చతురస్రాకారపుమందిరగర్భంలో కామాఖ్యదేవి మరియు ఉమానందులు విగ్రహరూపంలో వేంచేసివున్నారు. సాధారణంగా జరిగే అలంకరణలు, పూజలూ ఇక్కడే జరుగుతూవుంటాయి. మందిరం అంతాకూడా చుట్టూ పెద్దపెద్ద స్తంభాలతో, చిత్రవిచిత్రమైన దేవతావిగ్రహాలతో, నిగూఢమైన ఆధ్యాత్మికపరిమళంతో నిండి వుంటుంది. ఈమందిరంగుండా లోనికివెళితే అది గుహలాంటి మార్గంద్వారా గర్భగృహానికి దారితీస్తుంది. అక్కడ ఎటువంటి విగ్రహమూ కనిపించక, కేవలం భూగర్భంలోనుండి వెలికివొచ్చే జల మాత్రమే మనకు దర్శనమిస్తుంది. ఆజల ఒకపెద్ద రాతి మధ్యలోవున్న చీలికద్వారా వెలువడుతూ వుంటుంది. ఆచీలికనే యోనిరూపంలోని అమ్మగా భావించి పూజిస్తారు. అదే బ్రహ్మయోని. సర్వజగత్తు దానినుండే పుట్టింది కాబట్టి ఆమె జగన్మాతగా కీర్తించబడుతుంది. ఆఅమ్మ నిజమైన మాతృరూపంలో అక్కడ మనకు దర్శనమిస్తుంది. ఆయోనిరూపంలోనుండి వచ్చే జలలోని నీటిని అమృతప్రాయమైన ఆఅమ్మ ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. కామాఖ్యదేవాలయం, చాలా హిందూదేవాలయాలు వున్నట్లుగానే తూర్పుముఖంగా వుంటుంది. కాని అమ్మవారి యోనిరూపం మాత్రం ఉత్తరాభిముఖంగా వుంటుంది. అదేఆలయప్రాంగణంలోనే వినాయకుడు, విశ్వకర్మలు కూడా కొలువుతీరివున్నారు.

దశమహావిద్యలైన కాళి, తార, భువనేశ్వరి, త్రిపురసుందరి, ఛిన్నమస్త, ధూమవతి, భగళ, మాతంగి, కమలల దేవాలయాలు మరియు మహాశివుని రూపాలైన కాలభైరవ, ఘంటాకర్ణుల మందిరాలుకూడా ఈనీలాచలంపై నెలకొనివున్నాయి. ఇక్కడ కోతులు, తాబేళ్ళతోపాటు చాలా పెద్దసంఖ్యలో పావురాళ్ళు కూడా మందిరప్రాంగణంలోనే నివశిస్తూ ఆఅమ్మ యొక్క జగన్మాతృ స్వరూపాన్ని సదా స్ఫురణకుతెస్తూవుంటాయి.

స్థలపురాణం :
ఒకసారి బ్రహ్మదేవుడు ఈవిశ్వమంతా సృజించి, తన అద్భుతమైన సృజనాశక్తికి తానే కారణమనుకొని గర్వపడ్డాడు. ఈసృష్టిలో తాను ఒక భాగం మాత్రమేనని మరిచిపోయాడు. కరుణామయి అయిన జగన్మాత మహాకాళి ఈవిషయాన్ని గుర్తించి, తన అనుంగుపుత్రుడైన బ్రహ్మకి జ్ఙానోదయం చెయ్యాలని నిశ్చయించుకుంది. వెంటనే కేశి అనే రాక్షశిని సృష్టించింది. అది ఆవిర్భవించగానే సూటిగా బ్రహ్మమీదకి వెళ్ళి బ్రహ్మను మింగబోయింది. బ్రహ్మ ఈ దుశ్చర్యకి విపరీతంగా భయపడి, వెంటనే వైకుంఠానికి పరిగెత్తి, అక్కడ లక్ష్మీసమేతుడైన శ్రీమన్నారాయణుని శరణుకోరాడు.
తదనంతరం ఆ రాక్షశి కేశిపురం అనే నగరాన్ని నిర్మించుకొని, అక్కడి నుండి ప్రపంచాన్ని బాధించ సాగింది.
విష్ణుమూర్తి తనవద్దకు శరణుకోరి వచ్చిన బ్రహ్మకి అభయాన్ని ప్రసాదించి, ముప్పు తొలగటానికై జగన్మాతయైన మహాకాళిని పూజించమని బోధించాడు. అప్పటికి బ్రహ్మకి తను చేసినతప్పు అర్ధమై, సర్వసృష్టికి కారణభూతురాలైన ఆ మహామాయని ప్రార్ధించాడు. ఆయన ప్ర్రార్ధనకి సంతుష్టిచెందిన మహాకాళి తన హూంకారంతో కేశిని భస్మం చేసి, బ్రహ్మని దాని భయం నుండి విముక్తుణ్ణి చేసింది. ఆమె బ్రహ్మని, ఆయన పాపపరిహారార్థం ఆ కేశియొక్క బూడిదనుండి ఒక కొండని తయారుచేసి, ఆకొండనిండా ఆవులకోసం చక్కటి గడ్డిని మొలిపించమని ఆదేశించింది. అక్కడ ఆవులు ఆగడ్డిని ఎంతైతే తింటూవుంటాయో అంత పాపం ఆయననుండి తొలిగిపోతుందని ఆమె ఆశీర్వదించింది.
అప్పుడు ఆజగన్మాత తనమహిమతో ఒక అద్భుతమైన యోనిచక్రాన్ని సృష్టించి, దానిని నిత్యం ఆరాధించమని బ్రహ్మని ఆదేశించింది. కాని అప్పటికి ఆయన్నింకా పాపం ఆవరించే వుండటంవల్ల దానిని దర్శించలేకపోయాడు. అందువల్ల ఆయన వ్యధచెంది, అత్యంత కఠోరమైన తపస్సు చేయసాగాడు. కొన్నాళ్ళకి ఆయన తపస్సులో వుండగా ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆకాశంనుండి బయలుదేరివచ్చి, జగన్మాత సృష్టించిన ఆ యోనిచక్రంలో ప్రవేశించటం దర్శించాడు.
అప్పుడు ఆయన అత్యంత సంతోషంతో, పులకాంకిత శరీరంతో ఆ అమ్మని పూజించాడు. ఆతర్వాత దేవతలు, ఋషులు, సర్వమానవులూ కూడా పూజించి తరించారు. కాబట్టి కామాఖ్యదేవి భక్తుడైన బ్రహ్మదేవునికోసం లోకకళ్యాణార్థం పరమపావనమైన ఈ నీలాచలంపై వెలిసింది అని అర్థమౌతుంది.

కామాఖ్య సాధన:
కామాఖ్య అమ్మవారి గుడిలో మూడు ముఖ్యమైన పండగలని చేస్తారు.


Image
1. అంబూవాచి(అంబూబాసి/అమెతి) :
ప్రతిసంవత్సరం ఆషాఢమాసంలోని శుక్లసప్తమినుండి మొదలుకొని మూడురోజులు అమ్మవారు రజస్వల అవుతుంది. ఇది సుమారుగా జూన్ 23 నుండి 25 మధ్యలో వుండవచ్చు. ఈసమయంలో అక్కడి సహజసిద్దమైన జలలోని నీరు ఎరుపురంగులోకి మారుతుంది. దానిని అమ్మవారి యొక్క ఋతుస్రావం అంటారు. అప్పుడు ఆ యోనిశిలని వస్త్రంతోకప్పి, ఆలయాన్ని ఆమూడురోజులూ మూసివుంచుతారు. కామాఖ్యదేవికి, భూదేవికి భేధంలేదుకాబట్టి ఈదినాలలో భూమిని దున్నటంగాని, విత్తటంగాని చేయరు. ఆతర్వాత నాలుగోరోజు ఆలయాన్ని తెరిచి ఒకఅపూర్వమైన ఉత్సవాన్ని జరుపుతారు. అప్పుడు అమ్మవారిపై వుంచిన వస్ర్తభాగాలని మరియు సింధూరాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి స్వీకరిస్తారు. వాటిని ముఖ్యంగా తాంత్రిక పూజల్లో వినియోగిస్తారు.

2. నవరాత్రి ఉత్సవాలు :
ఆశ్వీజమాసంలో వచ్చే దేవీనవరాత్రుల సమయంలోనే ఇక్కడ ఈఉత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

3. దేవధ్వని (దేబద్ధని) :
ఈపండుగను జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మరియు భాద్రపదమాసాలలో , ఇంకా అంటురోగాలు, వ్యాధులు ప్రబలినపుడు మనసాదేవి ప్రీతికోసం ఆచరిస్తారు. ఈ పండుగసమయంలో విపరీతమైన ధ్వనిపుట్టించే డోలు, తప్పెట, భేరీ, మృదంగాలని వాడతారు కాబట్టి దీనికి దేవధ్వని అనేపేరు వచ్చింది.
ఇంకా కామాఖ్యదేవిని అనేకరకాలైన వామాచార మార్గాలలో కూడా పూజిస్తారు. ఆదేవి ప్రీతికోసం ఇక్కడ దున్నలు, గొర్ఱెలు, మేకపోతులు, కోతులు, తాబేళ్ళు, పావురాళ్ళు మొదలైనవాటిని (అన్నీ మగవి, ముఖ్యంగా నల్లరంగువి) బలి ఇస్తారు. ఆలయంలో ఇప్పటికీ ప్రతిరోజు ఒక దున్నపోతుని, మేకపోతుని, చేపని, చెరకుగడని మరియు ఒక గుమ్మడికాయని సాంప్రదాయంగా బలి ఇస్తారు. పూర్వకాలంలో మనుషుల్ని కూడా అమ్మవారికి బలిగా సమర్పించేవారని ప్రతీతి.

కాళికాపురాణంలో మరియు యోగినీతంత్రంలో కామాఖ్య అమ్మవారి గురించి విస్తారంగా వర్ణించబడివుంది.
కామాఖ్యా దేవి ఫొటోల కొరకు Kamakhya photos పేజీని చూడండి.

Topic Tags

Assam tourism, Guwahati tourism, Kali puja, Tantra goddess, Temples in North East India

  • NAVIGATION