వశిష్ఠ ఆశ్రమం - గౌహతి

Last visit was: Tue Jan 23, 2018 11:29 pm

వశిష్ఠ ఆశ్రమం - గౌహతి

Postby Uma on Wed Dec 09, 2009 10:54 pm

వశిష్ఠ ఆశ్రమం కాళికాపురాణంలో వర్ణించబడ్డ ఏడు శక్తిపీఠాలలో ఒకటి. పూర్వం ఒకానొకప్పుడు వశిష్ఠమహర్షి ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని నివశించాడు కాబట్టి ఈ ప్రదేశాన్ని వశిష్ట్టాశ్రమం అని పిలుస్తారు. పరమప్రశాంతమైన ఈ ఆశ్రమం తూర్పుగౌహతిలో కల సంధ్యాచలం అనే పర్వతంపై ఉంది. ఈ పర్వతం ఎటుచూసినా పచ్చని సోయగంతో, నిగూఢమైన ఆధ్యాత్మికతరంగాలతో నిండిన వాతావరణంతో, భక్తులనేకాక మహర్షుల మనసులనిసైతం హరిస్తూ ఉంటుంది.

 First Previous Next
Image
Image
Image
Image
Image

ఆలయం చిన్నగా, అందంగా వుండి దర్శింపవచ్చిన భక్తులకు తన నిశ్శబ్దసౌందర్యాన్ని దర్శింపచేస్తూ ఉంటుంది. ఆలయం ముందుభాగంలో ఒక పొడవాటి వసారా వుండి, వచ్చిన భక్తులు జపతపాలు చేసుకోవటానికి వీలుగావుంటుంది. ఇక గర్భగుడిలోకి ప్రవేశిస్తే అక్కడ చిన్నగా, బాగాలోతుగా వున్న బావులు మనకు దర్శనమిస్తాయి. ఈ గర్భగుడిలో బాగా చీకటిగా వుండటంవల్ల మొదట అక్కడ వున్నది మనకు అర్ధంకాక కొంత అయోమయానికి లోనవుతాం. మనం కొంత వెలుతురులో గమనించినట్లయితే ఈ బావులు నిండా నీటితో నిండివుంటాయని మనకు బోధపడుతుంది. ఆ నీటిఅడుగున చాలాలోతులో ఒక మహిమాన్వితమైన శివశక్తిపీఠం విరాజిల్లుతుంది. శివుడు గోళకేశ్వరుడిగా, శక్తి తారగా వీటిలో నెలకొని వున్నారు. మరొక బావిలో మంగళేశ్వరునిగా హరుడు శివలింగరూపంలో వెలిసివున్నాడు. ఇంకా వీరితోపాటు మహాతపోధనుడైన అయిన వశిష్ఠమహర్షి కూడా అదృశ్యరూపంలో ఇదే ఆలయంలో నివశిస్తున్నాడని ప్రతీతి.

ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆశ్రమం వెనకాల ఒకే సెలయేరు మూడు పాయలుగా విడిపోయి పారుతూవుంటుంది. వీటినే సంధ్య, లలిత, కాంత అనే పేర్లతో పిలుస్తారు. కాని కాళికాపురాణంలో వీటిని మూడు వేర్వేరు సెలయేరులుగా వర్ణించారు. ఈ మూడు పాయలు కలిసిన ప్రదేశాన్ని అమృతకుండం అని పిలుస్తారు. ఇందులో స్నానం చేయడంవల్ల తమ ఆయుష్షు పెరుగుతుందని భక్తుల విశ్వాసం.

ఇదే ప్రాంతంలోనే ఆశ్రమానికి కుడిప్రక్కన గల ఒక కొండపై వశిష్ఠమహర్షి భార్యయై, మహాపతివ్రతయైన అరుంధతీదేవి మందిరం ఉంది. ఈ మందిరం ఒక పెద్దరాతి క్రింద ఏర్పడిన ఖాళీలో కట్టబడింది. దీనిలో అరుంధతి, వశిష్ఠులు లింగరూపాలలో మనకు దర్శనమిస్తారు.

వశిష్ఠ ఆశ్రమం స్థలపురాణం :

పూర్వం ఒకానొకప్పుడు వశిష్ఠమహర్షి కామాఖ్యదేవిని పూజించాలనే సంకల్పంతో కామరూపదేశానికి విచ్చేశాడు. కాని కామాఖ్యదేవిపై తనకుమాత్రమే అధికారంవుందని భావించిన నరకుడు ఆ మహర్షిని నిరోధించాడు. దాని ఫలితంగా ఆ మహర్షి క్రోధితుడై "నీయొక్క అధికారం త్వరలోనే నాశనమైపోతుందని" తీవ్రంగా శపించాడు. ఆ తర్వాత శాంతుడై సంధ్యాచలానికి వెళ్ళి, అక్కడ ఆశ్రమం నిర్మించుకొని శివునికై తపస్సు చేయనారంభించాడు. ఈ ప్రదేశాన్నే ఇప్పుడు వశిష్ఠాశ్రమం అని పిలుస్తున్నారు.
కాని సంధ్యాచలానికి మాత్రం ఆపేరు సంధ్యాదేవి ఇక్కడ తపస్సు చేయటంవల్ల వచ్చింది. అసలు కధేమిటంటే సంధ్యాదేవి ఒకానొక సమయంలో నిండుయవ్వనవతిగా, అద్భుతమైన సౌందర్యంతో బ్రహ్మ మనసు నుండి ఉద్భవించింది. ఆ సమయంలో సప్తరుషులు కూడా అక్కడే వున్నారు. ఆ అనుపమానమైన అందాన్ని చూడటంతోనే బ్రహ్మతో సహా అందరికీ మనసు చలించింది. కాని ఆమె మనసు సప్తరుషులమధ్యలో అమిత తేజస్సుతో వెలిగిపోతూ వున్న వశిష్ఠుని వరించింది. ఈ అకార్యాన్ని గమనించి, ఆదిదేవుడైన శంకరుడు అక్కడ ప్రత్యక్షమై బ్రహ్మని, మరియు ఆయన పుత్రులైన సప్తరుషులను దానినుండి నివారించాడు. సంధ్యాదేవి కూడా తెలివితెచ్చుకొని సిగ్గుపడింది. తర్వాత ఆమె ఆత్మశుద్ది కోసం శివునిగూర్చి గొప్ప తపస్సుచేసింది. ఆమె యొక్క తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరంకోరుకోమనగా, ఆమె ఇకనుండి ఎవరూ కూడా తరుణప్రాయంలో జన్మించరాదని, మరియు యవ్వనం రాకుండా ఎటువంటి కామవాంఛలు కలగరాదని వరాల్నికోరింది. శివుడు కూడా లోకకళ్యాణకారకమైన ఆ వరాల్ని సంతోషంతో ప్రసాదించాడు. అప్పటినుండి మానవులకి జీవితంలో బాల్యదశ ఏర్పడింది. కాబట్టి సంధ్యాదేవి తపస్సువల్ల పునీతమైన ఈ ప్రదేశం సంధ్యాచలం అనే పేరుతో ప్రసిద్దిగాంచింది.

ఈ వశిష్ఠాశ్రమాన్ని బశిష్ఠ లేక బశిస్తో అని కూడా పిలుస్తారు.


Reference article : shakti-peethas/topic59.html

  • NAVIGATION