దుర్గాదేవి ఆలయం - వారణాశి

Last visit was: Tue Jan 23, 2018 11:29 pm

దుర్గాదేవి ఆలయం - వారణాశి

Postby Uma on Sun Dec 13, 2009 3:28 pm

సకలతీర్థాలకు నిలయమై, ఆ పరమేశ్వరునికి ప్రాణసమానమైన వారణాశిలోనే జగదంబయైన దుర్గాదేవి ఆలయం కూడా నెలకొనివుంది. దుర్గాదేవి ఆలయం ఆద్యంతం ఎర్రరాతిపై మలచిన అద్భుతమైన శిల్పాలతో అలరారుతూ వుంటుంది. మందిరం ప్రక్కనే పురాణప్రసిద్ధమైన దుర్గాకుండం కూడా ఉంది. ఇక్కడి దేవాలయంలో కోతులు ఎక్కువగా వుంటుండటంవల్ల దీనిని మంకీ టెంపుల్ అనికూడా పిలుస్తూవుంటారు.

Durga-temple-Varanasi.jpg

ఈ దుర్గాదేవిఆలయ నిర్మాణం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణగాధ వుంది.
పూర్వం ఒకప్పుడు ధ్రువసంధి అనే మహారాజు అయోధ్యని రాజధానిగా చేసుకొని కోసల దేశాన్ని పాలిస్తూ వుండేవాడు. అతనికి మనోరమ, లీలావతి అనే సర్వాంగసుందరులైన ఇద్దరు భార్యలు వుండేవారు. ధ్రువసంధికి పెద్దభార్య మనోరమ వల్ల సుదర్శనుడు చిన్నభార్య లీలావతి వల్ల శత్రుజిత్తు అనే కుమారులు కలిగారు. చిన్నతనం నుండి కూడా శతృజిత్తు సుదర్శనుడికంటే కూడా ఎక్కువ చలాకిగా, మంచి మాటకారిగా వుండి అందరి దృష్టినీ ఆకర్షించేవాడు. క్రమంగా వారిద్దరూ పెరిగి పెద్దవారవసాగారు. ఇది ఇలావుండగా ఒకరోజు వేటకని వెళ్ళిన ధ్రువసంధి మహారాజు సింహంనోటచిక్కి మరణించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కోసలరాజ్యమంతా విషాదంలో మునిగిపోయింది. మంత్రులందరూ సమావేశమయ్యి పెద్దవాడు, సుగుణశీలి అయిన సుదర్శనుడిని రాజుగా చేద్దామని తీర్మానించారు. కాని అప్పటికే తన సైన్యంతో అక్కడికి చేరుకున్న యధాజిత్తు (లీలావతి తండ్రి), ఆ తీర్మానాన్ని తోసిపుచ్చాడు. సమర్ధుడు, అందరి మన్ననలని పొందినవాడు అయిన తన మనమడు శత్రుజిత్తే రాజు కావాలని ప్రతిపాదించాడు. కాని అదే సమయంలో మనోరమ తండ్రి శూరసేనుడు కూడా తన మనమడు సుదర్శనుడికి బాసటగా అక్కడే వుండటంతో పరిస్థితి తీవ్రంగా మారి, భయంకరమైన యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో శూరసేనుడు మహావీరుడైన యధాజిత్తు చేతిలో హతుడైనాడు. ఈ వార్త తెలిసిన వెంటనే మహారాణి మనోరమ ఎంతో దుఃఖించి, తన కుమారుణ్ణి కూడా హతమారుస్తారని భయపడి, బిడ్డతో సహా రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె ఎన్నో ప్రమాదాలకోర్చి ప్రయాణిస్తూ త్రికూటాద్రి పై గల పరమపావనమైన భరద్వాజాశ్రమం చేరి, అక్కడ వున్న భరద్వాజ మహర్షిని శరణువేడింది. త్రికాలవేత్తయైన ఆ మహర్షి వారికి అభయమొసగి, తన ఆశ్రమంలో నివశించేందుకు ఏర్పాటు చేశాడు. ఈ విషయం చారులద్వారా తెలుసుకున్న యధాజిత్తు ఆ మహర్షి తపోబలానికి భయపడి సుదర్శనుణ్ణి హతమార్చే ఆలోచన అప్పటికి విరమించాడు.

ఇది ఇలా వుండగా ఒకరోజు సుదర్శనుడు ఆశ్రమంలోని తన ఈడు పిల్లలతో ఆడుకుంటూ వుండగా, ఒకపిల్లవాడు మనోరమకు తోడుగా ఆశ్రమానికి వచ్చిన నపుంసకుడైన సేవకుణ్ణి క్లీబా అని సంబోధించాడు. సంస్కృతంలో క్లీబా అంటే నపుంసకుడని అర్ధం. ఆ పిల్లవాడు కావాలనిగాని, అతణ్ణి కించపరచాలనే ఉద్దేశంతోగాని అనలేదు. కేవలం ఆటల్లో ఆటగా సరదాగా పలికాడు. అది విన్న సుదర్శనుడు బాల్యచాపల్యం వల్ల అదే పదాన్ని పదే పదే ఉచ్చరించసాగాడు. కాలక్రమంలో ఆ క్లీబా అనే పదం అతని నోటిలో క్లీం గా మారింది. ఇక రాత్రిపగలు ఆ జపం అప్రతిహతంగా కొనసాగుతూనే వుంది. అది కామబీజాక్షరమనిగాని, తాను చేస్తుంది మహాప్రభావవంతమైన క్లీం బీజాక్షర జపమనిగాని సుదర్శననికి తెలియకుండానే జపం నిర్విఘ్నంగా జరిగిపోతూవుంది. ఈ విషయాన్ని గమనించిన భరద్వాజ మహర్షి సుదర్శనునికి కామబీజాక్షరాధిదేవతయైన వైష్ణవీదేవి సాధన ఉపదేశించాడు.

కాలక్రమంలో సుదర్శనుడు పెరిగి పెద్దవాడయ్యాడు. దాంతోపాటే రాజోచిత విద్యలన్నీ భరద్వాజమహర్షి వద్ద నుండి నేర్చుకున్నాడు. ఇది ఇలా వుండగా సుదర్శనుడికి అతని అవిచ్ఛిన్న క్లీంకార జపఫలితంగా ఒకరోజు సర్వసౌందర్యాలకూ పరసీమయైన వైష్ణవీమాత సాక్షాత్కారం లభించింది. అప్పటి నుండి అతడికి ప్రతిరోజు స్వప్నంలో ఆ అమ్మదర్శనం అవుతూనే వుంది. ఒకరోజు సుదర్శనుడు ఆశ్రమప్రాంతంలో తిరుగాడుతూ వుండగా అతనికి అజేయమైనటువంటి దివ్యమైన బంగారపు ధనస్సు, అక్షయతూణీరాలు జగన్మాత ప్రసాదంగా లభించాయి. వాటిని ధరించి అతడు గుఱ్ఱంపై స్వారీ చేస్తుంటే చూసేవారికి ఒక మహాసైన్యంతో చక్రవర్తి విహారానికి వెళుతున్నట్టు అనిపించేది. పైగా కామబీజాక్షర జప ఫలితంగా అతడు అత్యంత సుందరుడు, ధృఢమైన దేహంకలవాడు కూడా అయ్యాడు.

ఆ సమయంలో కాశి సామ్రాజ్యాన్ని సుబాహువు అనే మహారాజు పరిపాలిస్తూ వుండేవాడు. ఆయన ఒక్కగానొక్క కూతురి పేరు శశికళ. అమిత సౌందర్యవతి. పైగా యవ్వనప్రాయంలోకి అడుగిడింది. అక్కడ ఆశ్రమప్రాంతంలో తిరుగాడే సుదర్శనుడి విషయం ఆనోటా ఈనోటా పడి చివరికి ఈ సుందరి కర్ణపుటాలలో దూరింది. అంతే. ఇక సుదర్శనుడే తన పతి అని మనసులో ధృఢంగా నిశ్చయించుకొని, అతడిని గాఢంగా ప్రేమించసాగింది. అదే సమయంలో ఒకరోజు రాత్రి మహామాయయైన వైష్ణవీదేవి శశికళకు కలలో దర్శనమిచ్చి సుదర్శనుణ్ణి వివాహమాడవలసిందిగా ఆదేశించింది. ఈ విషయాలేవీ తెలియని సుబాహుమహారాజు తన కుమార్తె వివాహం కోసం స్వయంవరాన్ని ప్రకటించాడు. కాని ఈ విషయం తెలిసిన శశికళ 'సుదర్శనుని తప్ప అన్యులని వివాహమాడనన్న' తన నిర్ణయాన్ని తండ్రికి తెలిపింది. మహారాజు ఎన్నోవిధాల నచ్చచెప్ప చూసాడు. కాని ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పైగా సుదర్శనుణ్ణి స్వయంవరానికి ఆహ్వానించమని ఒక బ్రాహ్మణుని కూడా పంపింది. అప్పుడు వైష్ణవీమాత కూడా ఆ స్వయంవరానికి వెళ్ళమని సుదర్శనుని ఆదేశించింది. భరద్వాజమహర్షి కూడా మనోరమా సుదర్శనులను ఆశీర్వదించి, వారిద్దరిని స్వయంవరమహోత్సవానికి సాగనంపాడు.

దేశదేశాలనుండి రాజులెందరో స్వయంవరం కోసం కాశి నగరానికి చేరుకున్నారు. అదేవిధంగా యధాజిత్తు కూడా తన మనమడైన శతృజిత్తుతో కూడి అక్కడికి వచ్చాడు. వచ్చినతర్వాత అతడికి సుదర్శనుడుకూడా స్వయంవరానికి వస్తున్నాడని, పైగా శశికళ అతడిని ముందుగానే వరించిందని తెలిసింది. దాంతో అతడికి పాత పగ గుర్తుకొచ్చింది. అందువల్ల అతడు రాజులందరిని సమావేశపరిచి శశికళ కనుక తమ అందరినీ కాదని రాజ్యభ్రష్ఠుడైన ఆ సుదర్శనుని పతిగా వరిస్తే తను సుదర్శనుణ్ణి చంపి తన మనమడైన శతృజిత్తుతో ఆమె వివాహం జరుపుతానని ప్రకటించాడు. ఈ విషయం తెలుసుకున్న సుబాహు మహారాజు కూతురికి ఈ విషయం చెప్పి మనసుమార్చుకొమ్మని అర్ధించాడు. కాని శశికళ ససేమిరా అంది. పైగా వైష్ణవీమాత ఆశీర్వాదం సుదర్శనునికి వుంది కాబట్టి ఏవరూ అతడిని ఏమీచేయలేరు అని తండ్రికి తెలిపింది. కూతురి ధృఢనిశ్చయాన్ని చూసిన సుబాహు మహారాజు చేసేది ఏమీలేక భారమంతా వైష్ణవీదేవి పై వేసి ఆ రాత్రికే ఒక శుభముహుర్తంలో రహస్యంగా శశికళాసుదర్శనుల వివాహాన్ని జరిపించాడు.

తెల్లవారుతూనే సకలరాజులకీ ఈ వివాహ విషయం తెలిసిపోయింది. మహారాజు భయపడుతూనే వారందరిని మర్యాదపూర్వకంగా రావించి జరిగినదంతా వారికి తెలియజెప్పి కలిగిన అసౌకర్యానికి క్షమించమని ప్రార్ధించాడు. చాలామంది రాజులు ఈ సమాధానంతో తృప్తిపడ్డారు. కాని యధాజిత్తు మాత్రం అసూయతో రగిలిపోయాడు. అతను తనలాగా ఆలోచిస్తున్న కొంతమంది రాజులతో కలిసి సమాలోచించి, తమందరి సర్వసైన్యాలతో కాశీనగర పొలిమేరలలో విడిది చేసాడు. ఇది ఇలావుండగా సుదర్శనుడు తన అమ్మతోనూ, భార్యతోనూ కలిసి భరద్వాజాశ్రమానికి బయలుదేరాడు. ఊరి పొలిమేరల్లో యధాజిత్తు సైన్యంతో వున్నాడన్న విషయం తెలుసుకున్న సుబాహువు తన సైన్యాన్ని తీసుకొని వీరికి రక్షణగా బయలుదేరాడు. కొంత సమయం గడిచాక ఇరువర్గాలు ఎదురుపడ్డాయి. దాంతో వారిమధ్య దారుణమైన యుద్ధం మొదలైంది. ఎంత యుద్ధం జరుగుతున్నా సుదర్శనుడు మాత్రం ఆత్మరక్షణకోసం బాణాలు వేస్తున్నాడు తప్ప, ఒక్కరినికూడా సంహరించటంలేదు. చాలా సమయం గడిచాక దీనికి ముగింపు పలకాలనుకున్న దుర్గామాత సింహవాహనయై అక్కడ ఆకాశంలో అవతరించింది. ఒక్కసారిగా రెండు బాణాలు ఎక్కుపెట్టి యధాజిత్తు, శత్రుజిత్తులపై వదిలి వారిని సంహరించింది. వారిద్దరూ ఒకేసారి మరణించటంతో వారి సైన్యం భయభీతులై పారిపోయారు. సహాయంగా వచ్చిన మిగిలిన రాజులు దుర్గామాతను శరణువేడారు. సుదర్శనుని నుండి జగన్మాత గురించి తెలుసుకున్న సుబాహు మహారాజు సంతోషంతో పులకాంకిత గాత్రుడై స్తుతించాడు. ఆ స్తుతికి మెచ్చిన ముగ్గురమ్మల మూలపుటమ్మ అతడిని వరం కోరుకోమంది. అప్పుడు సుబాహు మహారాజు కాశీ నగరాన్ని రక్షిస్తూ అక్కడే వుండవలసిందిగా ఆమెను ప్రార్థించాడు. అతడి ప్రార్థనని అంగీకరించి ఆ అమ్మ అక్కడ వున్న దుర్గాకుండం సమీపంలో వెలిసింది. ఆతర్వాత సుబాహువు అమ్మవారికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మింపచేశాడు.

సుదర్శనుడు అమ్మవారి ఆజ్ఞ ప్రకారంగా అయోధ్యానగరానికి వెళ్ళి కోసలదేశాన్ని శ్రీరామచంద్రుని వలే పరిపాలించసాగాడు. అక్కడ అతను వైష్ణవీదేవికి గొప్ప మందిరాన్ని నిర్మింపచేసాడు. సుదర్శనుని భక్తి ప్రభావంతో దేవీ పూజలు దేశమంతటా వ్యాపించాయి.


Reference article : shakti-peethas/topic29.html

Topic Tags

Durga puja, Shakti temples, Temples in Uttar pradesh, Travel Varanasi, Varanasi India

  • NAVIGATION