సంకష్టహర గణపతి వ్రతం

Last visit was: Mon Jan 22, 2018 12:07 pm

సంకష్టహర గణపతి వ్రతం

Postby Admin on Mon Jan 25, 2010 7:08 pm

గణేశుని వ్రతాలలో అత్యంత ప్రభావవంతమైనదీ, సర్వ సంకటాలను నివారించేదీ సంకష్టహర గణపతి వ్రతం. ఇది సుమారుగా ఏడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇందుకుగాను మాఘ మాసం, కృష్ణ పక్షం, చతుర్థి తిథి, మంగళ వారం, చంద్రోదయ సమయం అన్నీ కలిసి ఏక కాలంలో రావలసి ఉంటుంది. ఎన్నో జన్మల పుణ్య ఫలం వల్లనేగాని ఈ వ్రత వివరాలు తెలియడం ఆచరించడం సాధ్యం కావని పురాణాలు చెపుతున్నాయి. అటువంటి మంగళకరమైన వ్రత ముహూర్తం, మన అదృష్టవశాత్తు, వచ్చే నెల రెండవ తారీఖున (2nd February 2010 at night 9.00 P.M) రాబోతోంది.

అసలు సంకష్టహర గణపతి వ్రతమంటే ఏమిటి?

గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

సంకటహర గణపతి :

Sankashtahara-Ganapathi.jpg

సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి. అయితే మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి మరింత అరుదు. అదే వచ్చే నెల రెండో తారీఖున రాబోతున్న అద్భుత ముహూర్తం.

వ్రత కథ :

పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

సంక్షిప్త వ్రత విధానం :

1. సూర్యోదయమవకముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమూ, నిత్య పూజ పూర్తి చేసుకోవాలి.
2. తరువాత గణేశుని తలచుకొని ఆరోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించుకోవాలి.
3. పగలంతా ఉపవాసంగాని, అల్పాహారంతోగాని ఉండాలి. నిష్ఠతో గడపాలి.

4. సాయంత్రమవగానే తెల్ల నువ్వులూ, ఉసిరి కలిపి నూరిన చూర్ణంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి.
5. మట్టితో గణేశుని ప్రతిమచేసిగానీ, పసుపుతో మూర్తిని చేసిగానీ గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి.
6. ధూప, దీపములూ, పుష్పాలంకరణ చేసి, తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి.
7. మూడు ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను, యిరవయ్యొకటి లేదా అంతకంటే ఎక్కువగానీ కనీసం ఒక్కటైనాగానీ సమర్పించాలి.
8. నలభై ఎనిమిది నిముషాలపాటు ఏదైనా గణేశ మంత్ర జపం చేయాలి.

9. గణేశునికి నైవేద్యం సమర్పించి, హారతినివ్వాలి.
10. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి.
11. తప్పనిసరిగా చంద్రుని చూచి, చంద్రునికీ చతుర్థీ తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
12. తరువాత పూజామందిరంలోకి వెళ్ళి గణేశుని, "సంకటాం మాం నివారయ" (నా సంకటములను తొలగించు) అని వేడుకుని, నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
13. భోజన సమారాధన జరిపి, తరువాత తానూ భుజించాలి.

14. రాత్రంతా గణేశుని స్మరిస్తూ, కీర్తిస్తూ జాగారం చేయాలి.
15. తరువాత రోజు ఉదయం గణేశునికి సాధారణ పూజ చేసి, మళ్ళీ పూజించే అవకాశం అనుగ్రహించమంటూ స్వస్థానానికి తిరిగి వెళ్ళమని ప్రార్థించాలి.
16. తరువాత గణేశ నిమజ్జన కార్యక్రమం చేయాలి.

నిజానికి ఎంతో సులువుగా ఉన్నప్పటికీ, మనకు పూజలు అంతగా అలవాటు లేకపోవడంచేత, ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. నాకు కలిగిన సందేహాల నివృత్తి కోసం గణేశ పురాణం శోధించగా,

1. అతి ముఖ్యమైన వ్రత విధి ఏమిటి?
జ. పైన bold చేసినవి (2,3,7,8,11,12,13).
2. ఏ పూలు వాడాలి?
జ. మందారము వంటి ఎరుపు రంగు పూలు వినాయకునికి అత్యంత యిష్టం.
వినాయక చవితి నాడు తప్ప గణేశ్వరుని పూజలో ఎప్పుడూ తులసి ఆకులు గానీ పూలు గానీ వాడరాదు. కాబట్టి అవి నిషిద్ధం.
3. ఏ మంత్రం జపించాలి?
జ. గురువుచే ఉపదేశింపబడిన గణపతి మంత్రం అత్యుత్తమం. అయినప్పటికీ,
'గజానన' అనే నామ మంత్రంగానీ,
'సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః
ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య నజాయతే
' అనే నామ స్తోత్రంగానీ జపించవచ్చు.
4. నైవేద్యం ఏమి సమర్పించాలి?
కుడుములు, ఉండ్రాళ్ళు, అరటి కాయలు, పాయసము, నువ్వులు
5. ప్రసాదం తెల్లవారిన తరువాత స్వీకరించాలా?
జ. కాదు. చంద్రోదయం తరువాత గణేశునికి నమస్కరించి ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి.
6. రోజంతా గణేశ స్మరణలో గడపడానికి తేలికైన దారి ఏదైనా ఉందా?
జ. గణేశ పురాణం చదవడం (వినడం) లేదా గణేశునికై నైవేద్యాలు వండటం (సమర్పించడం). చేతనైతే నృత్య గీతాలూ మంచివే.
7. అర్ఘ్యం యివ్వటం తెలియకపోతే?
జ. నమస్కరించడం ఉత్తమం. తెలియని పూజావిధి తలకెత్తుకోవడం మంచిది కాదు.
8. పూజ చేయడం చేతకాదనుకుంటే?
జ. మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం. అయితే తప్పనిసరిగా పూజ పూర్తయిన వెంటనే దక్షిణ యివ్వండి.

వ్రతాచరణ వలన లాభాలు :

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.

అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని, ఒక్కరోజు ఆచరిస్తే చాలు గణేశలోకంలో స్థానాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని, మళ్ళీ ఏడేళ్ళ తరువాత వచ్చినా అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఉండవో, ఈసారి తప్పక ఆచరిచి, మన అదృష్టాన్ని సార్థకం చేసుకుందాం. ఆ శక్తి పుత్రుని శక్తి సహితుని అనుగ్రహాన్ని పొందుదాం.

చంద్రోదయ సమయములు

Postby Uma on Fri Jan 29, 2010 9:31 am

భారత ప్రామాణిక కాలము (కాకినాడ) : రాత్రి 9.13
హైదరాబాదు : రాత్రి 9:29, విజయవాడ : రాత్రి 9:19, విశాఖపట్టణము : రాత్రి 9:09
చెన్నై : రాత్రి 9:19, బెంగళూరు : రాత్రి 9:31
న్యూఢిల్లీ : రాత్రి 9:39, బొంబాయి : రాత్రి 9:53, కలకత్తా : రాత్రి 8:50
గౌహతి : రాత్రి 8:37, ద్వారక : రాత్రి 10:10
వారణాశి : రాత్రి 9:13, హరిద్వార్ : రాత్రి 9:36, ఉజ్జయిని : రాత్రి 9:42

పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేయండి. అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది.

సంకటహర గణపతి ధ్యానం, ఏకవింశతి నామాలు

Postby Admin on Sat Jan 30, 2010 1:16 am

ధ్యానం :

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం
లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం
ఆఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః
శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం

ఏకవింశతి నామ పూజ :


ఓం సుముఖాయ నమఃమాలతీ పత్రం పూజయామి
ఓం గణాధిపాయ నమఃబృహతీ పత్రం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమఃబిల్వ పత్రం పూజయామి
ఓం గజాననాయ నమఃదూర్వాయుగ్మం పూజయామి
ఓం హరసూనవే నమఃదత్తూర పత్రం పూజయామి
ఓం లంబోదరాయ నమఃబదరీ పత్రం పూజయామి
ఓం గుహాగ్రజాయ నమఃఅపామార్గ పత్రం పూజయామి
ఓం గజకర్ణాయ నమఃజంబూ పత్రం పూజయామి
ఓం ఏకదంతాయ నమఃచూత పత్రం పూజయామి
ఓం వికటాయ నమఃకరవీర పత్రం పూజయామి
ఓం భిన్నదంతాయ నమఃవిష్ణుక్రాంత పత్రం పూజయామి
ఓం వటవే నమఃదాడిమీ పత్రం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమఃదేవదారు పత్రం పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమఃమరువక పత్రం పూజయామి
ఓం హేరంబాయ నమఃసింధువార పత్రం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమఃజాజీ పత్రం పూజయామి
ఓం సురాగ్రజాయ నమఃగణ్డకీ పత్రం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమఃశమీ పత్రం పూజయామి
ఓం వినాయకాయ నమఃఅశ్వత్థ పత్రం పూజయామి
ఓం సురసేవితాయ నమఃఅర్జున పత్రం పూజయామి
ఓం కపిలాయ నమఃఅర్క పత్రం పూజయామి

వినాయక చవితి నాటి పూజకీ సంకటహర గణపతి పూజకీ తేడా కేవలం రెండు విషయాలలోనే. తులసీ పత్రం బదులు జంబూ పత్రం (నేరేడాకు) వాడటము, నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళకు తోడు నల్ల నువ్వులను సమర్పించడము.

సంకష్టి చతుర్థి 18/02/2014

Postby Admin on Tue Dec 31, 2013 9:19 pm

వచ్చే నెల 18వ తారీఖున అత్యద్భుతమైన సంకష్టహర చతుర్థి ముహూర్తం వస్తుంది. అందరూ ఆ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాలు పొందగలరు. పూర్తి వివరాలకై చూడండి : Sankashti chaturthi 18 Feb 2014, rarest of rare
Attachments
Sankashta-Nasana-te.pdf
(67.11 KiB) Downloaded 777 times

Re: సంకష్టహర గణపతి వ్రతం

Postby mouli251 on Thu Jan 02, 2014 11:47 am

చాలా మంచి వ్రత విషయము విశదపరచినందులకు ధన్యవాదములు.
వ్రత విధానమును తెలియపరచినారు. కానీ మా యందు దయయుంచి వ్రత కథను కూడా తెలియపరచగలరు.

ధన్యవాదములు.
చంద్రమౌళి పసుమర్తి

Topic Tags

Ganesh chaturthi, Indian festivals, Indian tradition, Meditation

  • NAVIGATION